డీఎంకే పాలనలో ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చారు: కోయంబత్తూరులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం

  • తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
  • కోయంబత్తూరులో స్థానిక వ్యాపారవేత్తలు, వివిధ రంగాల నిపుణులతో సమావేశం
  • డీఎంకే, దాని మిత్రపక్షాల వైఖరిపై విమర్శల వర్షం
  • డీఎంకే పాలనలో రాష్ట్రం వెనుకబడిపోయిందని విమర్శలు
  • ఏఐఏడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని గెలిపించాలని పిలుపు
మహిళా రిజర్వేషన్ బిల్లు, డిలిమిటేషన్ బిల్లును అడ్డుకుని డీఎంకే సహా ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు చారిత్రక తప్పిదం చేశాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు. వారి తప్పుడు నిర్ణయం వల్ల మహిళలకు, దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడులోని కోయంబత్తూరులో ఎన్డీఏ అభ్యర్థుల తరఫున అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన, స్థానిక వ్యాపారవేత్తలు, వివిధ రంగాల నిపుణులతో సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీఎంకే, దాని మిత్రపక్షాల వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు.

మహిళలు, దక్షిణాదికి తీరని ద్రోహం

ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని చట్టం తీసుకువస్తే.. డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ వంటి పార్టీలు దానిని వ్యతిరేకించాయని చంద్రబాబు మండిపడ్డారు. అదేవిధంగా, కేంద్రం ప్రతిపాదించిన డిలిమిటేషన్ బిల్లుతో దక్షిణ భారతదేశానికి సీట్లు పెరగవని అపోహ సృష్టించారని, వాస్తవానికి ఈ బిల్లుతో కనీసం 50 శాతం మేర సీట్లు పెరిగి దక్షిణాదికి మేలు జరిగేదని వివరించారు. 

"గడచిన 30 ఏళ్లుగా మహిళలు తమకు 33 శాతం రిజర్వేషన్ వస్తుందని ఎదురు చూస్తున్నారు. గతంలో దేవెగౌడ ప్రధానిగా ఉన్నప్పుడు ఈ బిల్లు తీసుకువస్తే కాంగ్రెస్ అడ్డుకుంది. ఇప్పుడు మోదీ ప్రభుత్వం తెస్తే ఇండి కూటమి పార్టీలు అడ్డుకున్నాయి. మహిళలకు అదనంగా సీట్లు పెంచే ప్రయత్నాన్ని వ్యతిరేకించడం ద్వారా మహిళా సాధికారతను నిలిపేశారు. దీనిపై ఆ పార్టీలు మహిళలకు సమాధానం చెప్పాలి" అని చంద్రబాబు డిమాండ్ చేశారు.

డీఎంకే పాలనలో తమిళనాడు విధ్వంసం

గతంలో తమిళనాడు బలమైన ఆర్థిక వ్యవస్థగా ఉండేదని, కానీ డీఎంకే పాలనలో రాష్ట్రం వెనుకబడిపోయిందని చంద్రబాబు విమర్శించారు. "గడచిన ఐదేళ్లుగా చెన్నై అభివృద్ధి ఆగిపోయింది. తమిళనాడుకు అప్పులు పెరిగాయి, యువత డ్రగ్స్ బారిన పడుతున్నారు, నేరాల రేటు పెరిగిపోయింది. డీఎంకే పాలనలో తమిళ ప్రజల మధ్య విబేధాలు, విద్వేషాలను రగిల్చారు. కేంద్రం లక్షల కోట్ల రూపాయలు అందిస్తున్నా, వాటిని సద్వినియోగం చేసుకోవడంలో డీఎంకే విఫలమైంది" అని ఆరోపించారు. రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని ఆయన పేర్కొన్నారు.

డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే అభివృద్ధి

ఆంధ్రప్రదేశ్‌లో డబుల్ ఇంజన్ సర్కార్ వల్లే అభివృద్ధి పరుగులు పెడుతోందని చంద్రబాబు ఉదహరించారు. "మేం ఐదేళ్లు అధికారంలో లేనప్పుడు రాష్ట్రాన్ని ఓ పార్టీ విధ్వంసం చేసింది. 2024లో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక, కేవలం 22 నెలల్లోనే అభివృద్ధిని పట్టాలెక్కించాం. దేశంలోకి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే వస్తున్నాయి. 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్, క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ వంటివి కేంద్ర ప్రభుత్వ చేయూతతోనే సాధించగలుగుతున్నాం. సంస్కరణలతో ముందుకు వెళ్తేనే భవిష్యత్తు ఉంటుంది" అని స్పష్టం చేశారు.

తెలుగు గంగ నుంచి గోదావరి-కావేరి దాకా

తమిళనాడుతో తెలుగు వారికి ఉన్న అనుబంధాన్ని చంద్రబాబు గుర్తుచేశారు. ఎన్టీఆర్ హయాంలోనే తెలుగు గంగ ద్వారా చెన్నైకి నీరిచ్చామని, ఇప్పుడు నదుల అనుసంధానం ద్వారా గోదావరి నీళ్లను తమిళనాడుకు ఇవ్వవచ్చని భరోసా ఇచ్చారు. "గంగ-కావేరి నదుల అనుసంధానం జరగాలి. ప్రధాని మోదీ ఆ దిశగా కృషి చేస్తున్నారు. గోదావరి-కావేరి నదులు అనుసంధానమైతే తమిళనాడు నీటి కష్టాలు తీరుతాయి. దేశానికి నీటి భద్రత వస్తే అదే శ్రీరామరక్ష" అని అన్నారు. ఎన్టీఆర్-ఎంజీఆర్ మధ్య ఉన్న స్నేహాన్ని, తన వివాహం చెన్నైలోనే జరగడాన్ని కూడా చంద్రబాబు ప్రస్తావించారు.

ద్రవిడ సంస్కృతి.. తమిళ సోదరుల స్ఫూర్తి

తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలది ద్రవిడ సంస్కృతేనని చంద్రబాబు అన్నారు. అత్యంత ప్రాచీన భాష అయిన తమిళాన్ని, తమ తల్లి భాషను తమిళులు ప్రేమించినంతగా ఎవరూ ప్రేమించలేరని కొనియాడారు. "క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడే మనస్తత్వమే తమిళ సోదరుల విజయ రహస్యం. సుబ్రమణ్య భారతి, కణ్ణగి, తిరువళ్లవర్ లాంటి ఎందరో మహానుభావులు ఈ గడ్డ నుంచే వచ్చారు. మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడటానికే కుప్పంలో ద్రవిడ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం" అని తెలిపారు. 

జయలలిత స్థాపించిన ఏఐఏడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని గెలిపించి అభివృద్ధికి సహకరించాలని ప్రజలను కోరారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, తమిళనాడు బీజేపీ చీఫ్ నయనార్ నాగేంద్రన్,  కోయంబత్తూరు నార్త్ అభ్యర్థి వానతి శ్రీనివాసన్, సౌత్ అభ్యర్థి అమ్మన్ కే. అర్జున్ సహా పలువురు ఎన్డీఏ అభ్యర్థులు పాల్గొన్నారు.



Chandrababu
Tamilnadu Assembly Elections
Coimbatore
NDA
AIADMK
BJP
Tamilnadu Andhra Pradesh

More Telugu News